Thursday, October 29, 2009

పుస్తక సమీక్ష-సమీక్షకులు: డాక్టర్ చందు సుబ్బారావు

పుస్తక సమీక్ష
అదృష్ట దీపక్ విశ్వరూపం
‘దీపకరాగం’
సమీక్షకులు: డాక్టర్ చందు సుబ్బారావు
సుప్రసిద్ధ అభ్యుదయ కవీ, సినిమా పాటల రచయితా అయిన అడృష్టదీపక్ సాహిత్యాభిమానులందరికీ సుపరిచితుడు. నటుడూ, గాయకుడూ, సంభాషణా చతురుడూ కావటం చేత ఒకసారి పరిచయమైతే మరిచిపోవటం సాధ్యం కాదు. అరసంలోనూ, ప్రజానాట్యమండలిలోనూ, వాటి అధినాయకసంస్థ అయిన భారత కమ్యూనిష్టు పార్టీ లోనూ1970నుంచీ క్రియాశీల పాత్ర పోషించిన దీపక్ నిబద్ధ వామపక్షవాదిగా రూపొందాడు. ప్రపంచంలో సామ్యవాద ఉద్యమంపరిఢవిల్లి ప్రజలు సుఖశాంతులతో విరాజిల్లాలని కలలుగన్నాడు. ఆ కలలే ఆతన్ని కవిగానూ, కళాకారునిగానూరూపొందించాయి. ఆ కలల వైఫల్యంతోపాటు అనేక రంగాలలో పతనమవుతున్న సామాజిక విలువలు ఆతనిలోతీవ్రమైన ఆగ్రహావేశాలను రేకెత్తించాయి. ఆతనిలో పెల్లుబికిన ఈధర్మాగ్రహం ‘చినుకు’ మాసపత్రికలో మూడేళ్ళపాటుదీపకరాగం’ ఆలపించింది. నిజాయితీలోపించి చీకటిలో తడుముకుంటున్న విమర్శనారంగంలో కొత్తదీపాలువెలిగించింది. ఇప్పుడు చినుకు ప్రచురణలద్వారా పుస్తక రూపంలో వెలుగు చూసింది.
అదృష్టదీపక్ లోని ఆవేశం కళారూపం తీసుకోవటం ఎంతయినా సంతొషించవలసిన విషయం. నచ్చని మనుషుల్నీ, వాళ్ళ ప్రవర్తనల్నీ, మెచ్చని రాజకీయ తాత్విక ధోరణుల్నీ, వాటి పర్యవసానాల్నీ అతను ఖండించేటప్పుడు వినటం గొప్పసరదాగా ఉంటుంది. పెనవేసిన అభినయం చూడటం కనులకింపుగా వుంటుంది. కానీ, అంతటితోనే ఆగితే అవిఅసంఖ్యాక పాఠకలోకానికి అందకుండాపోయేవి. నిబద్ధుడైన రచయిత వ్యాసం రాస్తే బోనెక్కి సాక్ష్యం చెప్పినట్టే వుంటుంది. వాదానికి వకల్తా పుచ్చుకున్నట్లే వుంటుంది. అచ్చమైన సాహితీ వ్యక్తిత్వానికి సుస్పష్టప్రకటన వెలువరించినట్లేవుంటుంది. వ్యాసరచనలో కవిత్వంలో లాగ దాక్కోటానికి వీల్లేదు. దీపక్ ది అసలే పుల్లవిరిచి పొయ్యిలోకి త్రోసేమనస్తత్వం. తన వ్యాస వ్యక్తీకరణల్లో కుండలు పగులగొట్టి పెంకుల్లో ప్రసాదాలు అందించాడు. దీపకరాగం సంపుటంచదివిన పాఠకుని హృదయంలోనిప్పురవ్వలు రాజుకుంటాయి. గుండెలు మండించి పదికాలాలపాటు ఆరోగ్యవంతమైనఅభినవేశానికి తలుపులు తెరుస్తాయి.
‘ఆధునిక సాహిత్యంలో పెరిగిపోతున్న పెడధోరణులనూ, వెకిలిరాతలనూ చూస్తున్నప్పుడు రా.రా అనే రెండక్షరాలుకళ్ళముందు మెరుస్తాయి’ అంటూ రా.రా స్ఫూర్తికి నివాళులర్పిస్తూ ఈ సంపుటంలోని వ్యాసాలు ప్రారంభమవుతాయి. వామపక్ష, అభ్యుదయ కవులూ, రచయితలూ, కళాకారులూ తరచుగా కనిపించే యీ వ్యాసాల్లో దీపక్స్వీయానుభవాలను కలపటం వలన చక్కటి ‘రీడబిలిటీ’వచ్చింది. మహాకవి శ్రీశ్రీ తోగడిపిన క్షణాలూ, కలిసి పనిచేసినస్మృతి వీచికలూ వివరించిన వ్యాసం ‘చదువ’ ముచ్చటగా వుంది. ఎప్పుడూ సీరియస్ గా కనిపించే చా.సో ను నవ్వించినవైనం సరదాగా వుంది. ప్రసిద్ధ బుర్రకధకుడు నాజర్ జ్ఞాపకాలనూ, బీవియస్ అనే కవిమిత్రుడి జ్ఞాపకాలనూనెమరువేయటంలో దీపక్ ప్రదర్శించిన శైలి పాఠకుల హృదయాలమీద బలమైన ముద్రవేస్తుంది. ఈపుస్తకం మొత్తంమీదకనిపించే విశిష్ట గుణాలలో ‘విమర్శనాత్మక పరిశీలన’, ‘అద్భుతమైన వస్తు వైవిధ్యం’ పాఠకులను ఎంతగానోఆకట్టుకుంటాయి.
ప్రజారంగాలలో దీపక్ కు పరిచయమైన అట్టడుగు ప్రజల జీవితానుభవం అతనికి అనేకసార్లు రచనల్లో సహకరించింది. పరిశీలనా తత్వంతో నిండిన వ్యాసకర్తగా పరిణమించటానికి యీ జీవితానుభవమే తోడ్పడింది. నిసర్గ సుందరమైనబ్రతుకుల రూపురేఖల్ని పట్టుకోవటంలో అతను చూపిన నేర్పు ప్రశంసనీయంగా వుంది. ‘నిత్య జీవితంలోకవిత్వం’అంటూసామెతల్నీ, నుడికారాల్నీ విశ్లేషించటం లోనూ, ‘చిందుల ఎల్లమ్మ కధ’ను సమీక్షించటంలోనూయీనేర్పు స్పష్టంగా కనిపిస్తుంది. తనలోని సహజ పరిశీలనాశక్తీ, ప్రగతిపధగమనంపై ఆసక్తీ అనేక విషయాలమీదతీవ్రమైన అభిశంసనకు, రచయితను పురిగొల్పాయి. అల్పిష్టి కవిత్వాలూ, అవధానాలూ, పత్రికాభాషలో పొల్లుమాటలూ, కళా వ్యాపారాలూ వంటి విషయాలమీద రచయిత అభిశంసన కళ్ళు మిరుమిట్లు గొలిపేలా మెరుపుదాడి చేస్తుంది. గాంధేయ వాదులు, కళామతల్లి, అశ్రుతాంజలి వంటి అర్ధంలేని పదప్రయోగాలపై నిశితమైన పరిశోధనా పద్ధతిలో దీపక్చేపట్టిన చర్చ అతనిలోని భాషావేత్తను మనకు పరిచయం చేస్తుంది.
పరస్పర సహకార పద్ధతిలో సాహిత్య, కళారంగాలలో భజనసంఘాలు చెలరేగిపోతున్న తరుణంలో స్వపర భేదంలేకుండాఅనేక అంశాలమీద దీపక్ కొరడా ఝలిపించిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. సినిమారంగంలో పాతికేళ్ళకు పైబడినఅనుబంధం వుండికూడా ‘చెవిలోపువ్వు అనే వజ్రోత్సవాల కధ’ వ్యాసంలో చిత్రసీమలోని అవకతవకలను నిర్దాక్షిణ్యంగాఎండగట్టాడు. సినిమా పాటలరచనల్లో తొంగిచూస్తున్న అవాంచనీయ ధోరణులూ, అవలక్షణాలూ వివరిస్తూ దీపక్ రాసినచిత్రహింసలు’ వ్యాసం కుహనా సినీ మేధావుల అజ్ఞానాన్ని బట్టబయలు చేస్తుంది. సినిమాల్లో వెకిలి హాస్యమూ, వెకిలిపాటలూ ఎంతహీనమైనవో చూపిస్తూ, మంచిపాటలు ఎలా పుట్టగలవో కూడా రచయిత సాధికారంగా నిరూపించాడు. ప్రతిదానినీ విమర్శించటమే తన ధ్యేయం అనుకోకుండా ‘మాయాబజార్’లాంటి కళాఖండంలోని విశిష్టతను నూతనకోణాలలో విశ్లేషిస్తూ ప్రశంసించాడు. అశోక్ కుమార్ ‘వ్యూహం’ సమీక్షించడంలోనూ, అప్పల్నాయుడు కధల్నిఆవిష్కరించటంలోనూ వ్యాసకర్తలోని సృజనాత్మకత ప్రతివాక్యంలోనూ ప్రతిఫలిస్తుంది.
‘పునర్మూల్యాంకనాలు’పేరుతో చరిత్రనూ, వైతాళికులనూ, సాహిత్య వేత్తలనూ భ్రష్టుపట్టిస్తూ వెలువడుతున్న ఓకొత్తధోరణిని దీపక్ తీవ్రంగా నిరసించాడు. పెడదారి పడుతున్న అత్యంత ప్రమాదకరమైన యీ వైఖరిని కొందరుమేధావులు అతినూతన కులు, మత, లింగ, ప్రాంతీయవాద చేతనగా అభిప్రాయపడుతున్నారు. ఉరుము ఉరిమిమంగళంపై పడ్డట్టు వీరి చైతన్యధాటికి మరణించిన మహానుభావుల కీర్తి ప్రతిష్టలు అన్యాయంగా బలైపోతున్నాయి. దీనినిరచయిత ఖండించటం సబబైన చర్యే. ఈ సంపుటానికి మకుటంగా నిలిచే మరో ముఖ్యమైన అంశం - అజ్ఞాన తిరస్కారం. ‘నేటి నిజం చూడలేని కీటక సన్యాసుల’ పట్ల దీపక్ రాజీలేని శత్రుత్వాన్నిప్రదర్శించాడు.
గురజాడనూ, గిడుగునూ, కందుకూరినీ, శ్రీశ్రీని నిష్కారణంగా నిందించే దివాంధాల గుండెల్లో డైనమైట్లు పేల్చాడు. ఆవ్యాసాల్లో దీపక్ లోని వ్యంగవైభవం పరాకాష్టనందుకుంది. సామాజిక ప్రయోజనాన్ని విస్మరించి బూతునుకళారూపంగా మభ్యపెడుతున్న ఎమ్. ఎ.ఫ్ హుస్సేన్ లాంటి ప్రముఖ చిత్రకారుడిలోని బుద్ధివైపరీత్యాన్ని ‘పిచ్చిగీతలు’ వ్యాసంలో చీల్చిచెండాడాడు. అలాగే శిల్పాశెట్టి - రిచర్డ్ గెరెల బహిరంగ శృంగార సన్నివేశాల్ని ఖండిస్తూ విపులచర్చచేయటం బహుధాప్రశంసనీయం. మేధావులుగా పోజుకొడుతూ, వేదికలమీద చప్పట్లకోసం ఆత్మలుఅమ్ముకుంటున్న కుహనా లౌకికవాదులూ, విచ్చలవిడి స్వేచ్చాజీవులూ యీ వ్యాసాలలో ప్రదర్శితమైన నిజాయితీనిచూసి సిగ్గుతో తలవంచుకోవాలి.
రకరకాల ప్రలోభాలతో సాహిత్యరంగాన్ని నాశనం చేస్తున్నముందుమాటలూ, గ్రంధ సమీక్షలూ యువతరాన్ని పక్కదారిపట్టిస్తున్నాయి. ఎవరికీ కనిపించని దేవతా వస్త్రాల అందచందాల గురించి సిగ్గులేకుండా ప్రచారం చేస్తున్నాయి. ఇలాంటికలుషిత వాతావరణంలో అదృష్ట దీపక్ తన దీపక రాగాలాపనతో సహృదయులైన చదువరులైన హృదయాలనుహృద్యంగా వెలిగించాడు. ఈ పుస్తకం చదివినవారు ఓమంఛి పని చేసినట్లు ఫీలవుతారని నా ప్రగాఢ విశ్వాసం. ఎందుకంటేనిరంతరం అధ్యయనశీలి అయిన అదృష్ట దీపక్ వ్యాసాలు పడికట్టు రాళ్ళతో కూడిన ఎకడమిక్ ప్రపంచం నుండి గాక, స్వచ్చమైన బ్రతుకు నల్లరేగడి భూమినుండి ప్రభవించాయి. అభ్యుదయ రచయితకు ప్రాణప్రదమైన ‘విమర్శనాత్మకవాస్తవికత’యీ పుస్తకంలో విశ్వరూపం ప్రదర్శించింది! పతనమవుతున్న విలువలమీద రచయిత ధిక్కారస్వరంభాస్వరమై ప్రజ్వలించింది!!
‘ ‘